సిరిసిల్లలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన “అరైవ్.. అలైవ్” కార్యక్రమంలో రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు. జిల్లా పోలీస్ శాఖ, రవాణా శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కే కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితే తదితరులు పాల్గొన్నారు. వాహన డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం, సీపీఆర్ ప్రథమ చికిత్సపై శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐజీపీ రమేష్ నాయుడు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదాల సమయంలో ముందుగా స్పందించి బాధితులను రక్షించేవారు డ్రైవర్లేనని తెలిపారు. ఆటో డ్రైవర్లు నిబంధనల మేరకు మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవాలని సూచించారు. విద్యార్థుల రవాణాలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు, డ్రైవర్లకు సూచించారు. ‘రహావీర్’ పథకం ద్వారా ప్రమాదం జరిగిన గంటలోపు బాధితులను ఆసుపత్రికి తరలిస్తే ఉచిత చికిత్సతో పాటు ఆర్థిక సహాయం అందుతుందని వివరించారు.
తెలంగాణలో రోజుకు సుమారు 70 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో 20 వరకు మరణాలు సంభవిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఓవర్ స్పీడ్, తప్పుగా ఓవర్‌టేకింగ్ చేయడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. వాహనాలు 80 కిమీ వేగ పరిమితి లోపలే నడపాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా గత ఏడాది 4.7 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగి 1.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రయాణించాలని సూచించారు.
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. జిల్లాలో రోడ్ సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో 8 బ్లాక్ స్పాట్స్ గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి అని పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, వైద్యులు, పోలీస్ సిబ్బంది, డ్రైవర్లు పాల్గొని రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు.






