- రాజు పుష్ప క్లబ్ హౌస్ లో సైబర్ నేరాల పై అవగాహన
- ప్రజలకు అవగాహన కల్పించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీలు
- తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిజిపి శిఖా గోయెల్ ఆదేశాల మేరకు కార్యక్రమం
సైబర్ నేరాల పై ప్రతి ఒకరికి అవగాహన అవసరమని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీలు సూచించారు. ఆదివారం తెల్లాపూర్ పరిధిలోని రాజ్ పుష్ప క్లబ్ హౌస్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీ లో డిజిటల్ అరెస్టు పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిజిపి శిఖా గోయెల్ ఆదేశాల మేరకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీలు హరికృష్ణ, కె.వి ఎం ప్రసాద్, సూర్య ప్రకాష్, సంగారెడ్డి జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పి వేణుగోపాల్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు డిజిటల్ అరెస్టుల పై అవగాహన కలిగి ఉండాలని, పోలీసులు ఎవరు డిజిటల్ రూపంలో అరెస్టులు చేయరని, డిజిటల్ అరెస్టు పేరుతో ఫోన్ కాల్ వస్తే సైబర్ నేరగాళ్ల నుండి వచ్చిందని గుర్తుంచుకోవాలన్నారు. సోషల్ మీడియాను అదునుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు యువత, సీనియర్ సిటిజన్, విద్యార్థులు అన్ని వర్గాల వారిని టార్గెట్ చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టకూడదని, గుడ్డిగా అపరిచిత వ్యక్తులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను నమ్మకూడదని తెలిపారు. ఏదైనా సైబర్ క్రైమ్ జరుగుతే వెంటనే 1930 కు ఫోన్ కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన గంట వ్యవధిలో (గోల్డెన్ అవర్) లో ఫిర్యాదు చేసినట్లయితే నగదు సీజ్ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
అనంతరం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు అడిగిన ప్రశ్నలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ నైబర్ హుడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ, సభ్యులు మదన్మోహన్, వేణుగోపాల్ రెడ్డి, బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.