Breaking News

CEIRతో 76.8% మొబైల్ రికవరీ రేటు.. రాష్ట్రంలో వరుసగా మూడో ఏడాది ప్రథమ స్థానంలో జిల్లా పోలీసులు

13 లక్షల విలువైన 90 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత – జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్

జిల్లా పోలీసులు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) వ్యవస్థను సమర్థంగా వినియోగిస్తూ మొబైల్ ఫోన్ రికవరీలో రాష్ట్రవ్యాప్తంగా వరుసగా మూడో ఏడాది ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 76.8 శాతం మొబైల్ రికవరీ రేటుతో ఈ ఘనత సాధించడం జిల్లా పోలీసు యంత్రాంగం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్న తీరు, నిరంతర పర్యవేక్షణకు నిదర్శనమని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ తెలిపారు.

సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సెల్‌ఫోన్ రికవరీ మేళాలో గత కొంతకాలంగా పోయిన లేదా చోరీకి గురైన సుమారు రూ.13 లక్షల విలువైన 90 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ ఫోన్లను గుర్తించి రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుతం మొబైల్ ఫోన్ ప్రతి వ్యక్తి జీవితంలో కీలక భాగంగా మారిందన్నారు. బ్యాంక్ ఖాతాల వివరాలు, పాస్‌వర్డ్లు, వ్యక్తిగత సమాచారం, డిజిటల్ చెల్లింపుల యాప్‌లు వంటి కీలక సమాచారం మొబైల్‌లోనే ఉండటంతో, నేరగాళ్లు బలహీనమైన పాస్‌వర్డ్లను ఛేదించి ఫోన్‌పే, గూగుల్ పే తదితర యాప్‌ల ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అందువల్ల మొబైల్ పోగొట్టుకున్న వెంటనే CEIR పోర్టల్‌లో ఫోన్‌ను బ్లాక్ చేసి, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

మొబైల్ ఫోన్ పోయినా లేదా చోరీకి గురైనా వెంటనే **www.ceir.gov.in**లో ఫిర్యాదు నమోదు చేసి CEIR సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు ముఖ్య సూచనలు

నల్లగొండలో అర్ధరాత్రి ప్రత్యేక నాకాబందీ: 146 వాహనాలు సీజ్.. 91 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా బిల్లు లేదా రసీదు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. తక్కువ ధరకు లభిస్తోందని భావించి దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను కొనుగోలు చేస్తే చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. దొంగిలించబడిన మొబైల్ అని తెలిసి కూడా కొనుగోలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే మొబైల్ ఫోన్లను విక్రయించాలనుకునే వారు అధికారిక ఎక్స్చేంజ్ కేంద్రాలు లేదా సంబంధిత కంపెనీల ద్వారానే విక్రయించాలని, తెలియని వ్యక్తులకు లేదా అనధికారిక మొబైల్ దుకాణాలకు విక్రయించవద్దని సూచించారు. ఇటువంటి ఫోన్లు సైబర్ నేరాలకు వినియోగించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

జిల్లాలో CEIR ద్వారా పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో విశేష కృషి చేసిన ఐటీ కోర్ ఎస్‌ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుమలేష్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

తమ పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి లభిస్తాయని ఆశించని బాధితులు, ఆధునిక సాంకేతికతను వినియోగించి ఫోన్లను రికవరీ చేసి అందజేసిన జిల్లా పోలీసులకు, ముఖ్యంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్‌ఐ సురేష్, ఐటీ కోర్ ఎస్‌ఐ కిరణ్ కుమార్, ఆర్‌ఐ యాదగిరి, కానిస్టేబుల్ రాజా తిరుమలేష్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *