నల్లగొండ, జూలై 12: నల్లగొండ పట్టణ వ్యాప్తంగా పోలీసులు శనివారం అర్ధరాత్రి ప్రత్యేక నాకాబందీ నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విస్తృతంగా చర్యలు చేపట్టారు. మొత్తం 17 చెకింగ్ పాయింట్లలో నిర్వహించిన ఈ డ్రైవ్‌లో 146 వాహనాలను స్వాధీనం చేసుకోగా, 91 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితులపై కేసులు నమోదు చేశారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల అమలు, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాల తనిఖీ, ప్రజల భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో 7 మంది సీఐలు, 24 మంది ఎస్ఐల ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నమోదైన కేసులు
- డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు – 91
- ట్రిపుల్ రైడింగ్ కేసులు – 30
- మైనర్ డ్రైవింగ్ కేసులు – 9
- మోడిఫైడ్ సైలెన్సర్ వాహనాలు స్వాధీనం – 4
- నంబర్ ప్లేట్ లేని వాహనాలపై చర్యలు – 73
- హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వారిపై చర్యలు – 97
- వాహన పత్రాలు లేకుండా ప్రయాణించిన వారిపై చర్యలు – 81
- మొత్తం స్వాధీనం చేసుకున్న వాహనాలు – 146
- ఈ-చలాన్లు – 134
- ఈ-పెట్టి కేసులు – 11
అదేవిధంగా, పాపిలాన్ (Papillon) పరికరం ద్వారా ఇద్దరు అనుమానితులను గుర్తించి వారి వివరాలను పరిశీలించారు. 12 మంది రౌడీషీటర్లను తనిఖీ చేసి వారి కదలికలపై నిఘా ఉంచారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు అమర్చిన రెండు బ్లాక్ ఫిల్మ్‌లను కూడా తొలగించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణాల రక్షణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, మైనర్లతో వాహనాలు నడిపించడం, ట్రిపుల్ రైడింగ్ వంటి చర్యలు తీవ్రమైన రోడ్డు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వాహనాలకు సంబంధించిన చట్టబద్ధ పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ఇటువంటి ప్రత్యేక నాకాబందీ కార్యక్రమాలు జిల్లాలో నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ ప్రత్యేక నాకాబందీ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐలు, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
