నల్లగొండ: జిల్లా పోలీసు శాఖలో పరిపాలనా పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేడు నల్లగొండ డీఎస్పీ కార్యాలయం, టూ టౌన్ సీఐ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రేవ్ కేసులకు సంబంధించిన క్రైమ్ ఫైల్స్, పెండింగ్ కేసుల రికార్డులు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు.
బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులకు సూచించిన ఎస్పీ, హత్యలు, దోపిడీలు, మహిళలు, చిన్నారులపై నేరాలు, సైబర్ నేరాల వంటి కీలక కేసులను వేగంగా ఛేదించాలని ఆదేశించారు. ప్రతి కేసులో పటిష్టమైన ఆధారాలు సేకరించి నిందితులకు చట్టపరమైన శిక్షలు పడేలా దర్యాప్తు నాణ్యత ఉండాలని స్పష్టం చేశారు.
సీసీటీఎన్‌ఎస్ నమోదు విధానం, డిజిటల్ రికార్డుల నిర్వహణ, కోర్టు డిస్పోజల్ కేసుల ఫాలోఅప్, పెండింగ్ వారెంట్ల అమలు తదితర అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు పోలీసు శాఖపై మరింత విశ్వాసం పెరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించిన ఎస్పీ, ప్రతి అధికారి ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా పనిచేయాలని ఆదేశించారు.
ఈ తనిఖీలో డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
