సైబర్ నేరాలకు ప్రధాన ఆయుధంగా మారుతున్న ‘ఘోస్ట్ సిమ్’ నెట్‌వర్క్‌పై హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం భారీ స్థాయిలో ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ నిర్వహించింది. గతంలో మ్యూల్ అకౌంట్లపై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 1.0’, బ్యాంకు అధికారుల ప్రమేయంపై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’ చేపట్టిన పోలీసులు.. ఈసారి ఘోస్ట్ సిమ్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన 1194 ఘోస్ట్ సిమ్ కార్డుల ఆధారంగా 18 ప్రత్యేక బృందాలు 13 రాష్ట్రాల్లో ఏడు రోజుల పాటు సోదాలు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో మొత్తం 66 మంది నిందితులను అరెస్ట్ చేయగా, 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 432 సీల్డ్ సిమ్‌లు, 112 యాక్టివ్ సిమ్‌లు ఉన్నాయి.
అరెస్టయిన వారిలో 44 మంది ఘోస్ట్ సిమ్ వినియోగదారులు, 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్లు లేదా టెలికాం ప్రమోటర్లు, ఇద్దరు సిమ్ సరఫరాదారులు ఉన్నారు. వీరంతా దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్ నేరాల్లో భాగస్వాములైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మోసాల మొత్తం విలువ రూ.101.87 కోట్లు.
వోడాఫోన్ ఐడియాకు చెందిన 10 మంది, ఎయిర్‌టెల్‌కు చెందిన ఏడుగురు, జియోకు చెందిన ముగ్గురు PoS ఏజెంట్లు అరెస్టయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి.
దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త సిమ్ లేదా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం వచ్చిన వినియోగదారుల బయోమెట్రిక్ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ, వారికి తెలియకుండా అదనపు సిమ్ కార్డులు యాక్టివేట్ చేస్తున్నట్లు గుర్తించారు. ‘నెట్‌వర్క్ సమస్య’, ‘సర్వర్ డౌన్’, ‘వేలిముద్ర సరిగా పడలేదు’ అంటూ పలుమార్లు బయోమెట్రిక్ తీసుకుని అక్రమ సిమ్‌లు సృష్టిస్తున్నట్లు తేలింది.
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అమాయకులు, నిరక్షరాస్యుల ఆధార్ వివరాలతో సిమ్‌లు యాక్టివేట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సిమ్ కార్డులను వెంటనే e-SIMలుగా మార్చి విదేశాల్లో ఉన్న సైబర్ ముఠాలకు పంపిస్తున్నారు.
ఈ ఇండియన్ నంబర్లతో వాట్సాప్, టెలిగ్రామ్, డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, సెక్స్‌టార్షన్ వంటి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసు ఛేదనలో సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివ మారుతి మరియు ప్రత్యేక బృందాలు కీలక పాత్ర పోషించాయి.
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీస్.. ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్-ఐడియా వంటి టెలికాం సంస్థల ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. అలాగే డీవోటీ, ట్రాయ్ సంస్థలను సంప్రదించి కేవైసీ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కోరనుంది.
ప్రజలకు సూచనలు
ప్రజలు తమ ఆధార్, బయోమెట్రిక్ వివరాలు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. తమ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ ‘సంచార్ సాథీ’ పోర్టల్ ద్వారా పరిశీలించాలని సూచించారు.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
