Breaking News

ప్రజా పాలనలో భాగంగా సంగారెడ్డిలో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత కార్యక్రమం


తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సంగారెడ్డి జిల్లా వాక్సెన్ యూనివర్సిటీలో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ పై అవగాహన కల్పించారు.

జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన లేకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ నియమాలను పాటించడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని అన్నారు.

డిఫెన్సివ్ డ్రైవింగ్ పై మాట్లాడిన అధికారులు, డ్రైవర్ వాహనం పరిస్థితి, రహదారి పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని, వేగాన్ని నియంత్రించడం అత్యంత ముఖ్యమని చెప్పారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని, అలసటతో డ్రైవింగ్ చేయవద్దని సూచించారు.

అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలకు ఎవరూ అతీతులు కారని, ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. అతివేగం క్షణిక ఆనందాన్ని ఇచ్చినా ప్రాణ నష్టానికి దారితీస్తుందని హెచ్చరించారు. గమ్యాన్ని చేరుకోవడం ఎంత ముఖ్యమో, సురక్షితంగా చేరుకోవడం అంతకంటే ముఖ్యమని పేర్కొన్నారు.

“అరైవ్ అలైవ్” ప్రచారంలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సహాయం చేసే వ్యక్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాహ్ వీర్ పథకం గురించి కూడా వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రికి చేర్చిన వారికి రూ.5,000 వరకు బహుమతి అందిస్తారని తెలిపారు. అదేవిధంగా సీపీఆర్ పై అవగాహన ఉండడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు.

వాక్సెన్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన స్మార్ట్ సేఫ్టీ హెల్మెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితుల్లో సెన్సార్ ద్వారా సమాచారం పోలీసులకు చేరే విధంగా ఇది పనిచేస్తుందని, మహిళల భద్రత కోసం ఎస్‌ఓఎస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని నిర్వాహకులు తెలిపారు. బస్సుల్లో అగ్ని ప్రమాదాల సమయంలో ప్రయాణికుల భద్రత కోసం ఆటోమేటిక్ గ్లాస్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వివరించారు.

ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు, పోలీసు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *