Breaking News

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత కార్యక్రమం

నల్లగొండ, ఏప్రిల్ 15, 2026: నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత కార్యక్రమం మూడవ రోజు సందర్భంగా పిల్లల రోడ్డు భద్రత దినోత్సవం పురస్కరించుకొని నల్లగొండ పట్టణంలోని మౌంట్ ఫోర్ట్ స్కూల్ (CBSE)లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాల ప్రాముఖ్యతను వివరించారు. చిన్న వయస్సులోనే రోడ్డు భద్రత నియమాలను తెలుసుకొని వాటిని కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. హెల్మెట్ వినియోగం లేకపోవడం వల్ల జరిగే ప్రమాదాలలో జిల్లాలో ప్రతి సంవత్సరం అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు హెల్మెట్ కొనివ్వమని లేఖలు రాయడం ద్వారా కుటుంబ స్థాయిలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించవచ్చని తెలిపారు.

అలాగే రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ వినియోగించడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవించడం, స్కూల్‌కు వెళ్లే సమయంలో ఇరుపక్కల చూసి జాగ్రత్తగా దాటడం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించే సమయంలో సీట్‌బెల్ట్ వినియోగించడం, స్కూల్ బస్సులో ఎక్కడం, దిగడం సమయంలో పాటించాల్సిన భద్రతా నియమాలు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.

స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు: సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మునుగోడు క్రాస్ రోడ్డులో రోడ్డు భద్రతపై సందేశం ఇచ్చే విధంగా హ్యూమన్ చైన్ నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాలపై మరియు తల్లిదండ్రులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ లేఖలు రాసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐలు గోపాల్ రావు, సతీష్, ఇతర పోలీస్ అధికారులు, స్కూల్ ప్రిన్సిపాల్ బాల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *