విషయం: క్వి నెట్ (Q-Net) / విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ మల్టీ లెవల్ మార్కెటింగ్ భారీ కుంభకోణం గుట్టురట్టు – 32 మంది నిందితుల అరెస్ట్.
దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల మేర ప్రజలను మోసం చేస్తూ, అక్రమ ద్రవ్య చలామణి పథకాలను ప్రోత్సహిస్తున్న ‘విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ (Q-Net) సంస్థపై హైదరాబాద్ సిటీ పోలీస్ కి చెందిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) ప్రత్యేక బృందాలు మెరుపు దాడులు నిర్వహించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 32 మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.

కేసు వివరాలు:
గతంలో గోల్డ్ క్వెస్ట్, క్వెస్ట్ నెట్ అని పిలవబడే ఈ సంస్థ, హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే ‘QI గ్రూప్’కు చెందిన అనుబంధ సంస్థ. ఈ సంస్థ ప్రధానంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, నిరుద్యోగులు, గృహిణులు మరియు వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడుతోంది.
• మోసపూరిత విధానం: నిందితులు హైటెక్ సిటీలోని ప్రముఖ హోటళ్లలో సమావేశాలు ఏర్పాటు చేసి, ఈ-కామర్స్ వ్యాపారం మరియు పెట్టుబడుల పేరుతో ప్రజలను ఆకర్షిస్తారు. 5 నుండి 10 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే, రెండేళ్లలో 3 నుండి 4 కోట్ల రూపాయల లాభం వస్తుందని నమ్మిస్తారు.
• గోప్యత: ప్రారంభంలో వీరు క్వి నెట్ (Q-Net) పేరును కానీ, ఇది ఒక మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) లేదా బైనరీ పద్ధతి అని కానీ వెల్లడించరు.
• తప్పుదారి పట్టించడం: బాధితులు డబ్బు చెల్లించిన తర్వాత, వారి ప్రమేయం లేకుండానే ఆ మొత్తాన్ని వస్తువుల కొనుగోలుకు మళ్ళిస్తారు. ఇంటికి వస్తువులు వచ్చినప్పుడు, అవి కంపెనీ ఇచ్చిన బహుమతులని నమ్మిస్తూ అసలు పెట్టుబడిని పథకంలోకి మారుస్తారు.
చట్టవిరుద్ధమైన పథకాలు:
ఈ సంస్థ బైనరీ స్కీమ్ (1+2+4+8…) పద్ధతిలో పనిచేస్తుంది. ఇందులో చేరిన వారిని ‘ఇండిపెండెంట్ రిప్రజెంటేటివ్స్’ (IR) అని పిలుస్తారు. కొత్త సభ్యులను చేర్పించడం ద్వారా భారీ కమీషన్లు వస్తాయని ఆశ చూపడం, ‘ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధిత) చట్టం, 1978’ ప్రకారం నేరం. గౌరవనీయ సుప్రీంకోర్టు సైతం ఇటువంటి పథకాలు సాధ్యం కావని, ఇవి ప్రజలను వంచించే మార్గాలని గతంలోనే స్పష్టం చేసింది.

అరెస్టుల వివరాలు:
ఈ రోజు (23-03-2026), హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 30 బృందాలుగా విడిపోయి నిర్వహించిన అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో 11 మంది మహిళలతో సహా మొత్తం 32 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో అత్యధికులు ఐటీ (IT) ఉద్యోగులు కావడం గమనార్హం. ప్రస్తుతం నమోదైన 4 కేసులలో 11 మంది బాధితుల నుండి సుమారు 75 లక్షల రూపాయల నష్టం జరిగినట్లు గుర్తించాము. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రజలకు విజ్ఞప్తి:
సామాన్య ప్రజలు ఇటువంటి మోసపూరిత మల్టీ లెవల్ మార్కెటింగ్ పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము. ఇటువంటి పథకాల్లో చేరడం, ఇతరులను చేర్పించడం లేదా వీటి ద్వారా డబ్బు సంపాదించడం చట్టరీత్యా నేరం. బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించగలరు.
