చెరువుగట్టు శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్ట భద్రతా..
భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 1000 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు
..
సీసీటివి కెమెరాల నిఘాతో పర్యవేక్షణ, నిరంతర నిఘా ఏర్పాటు ..
ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు ..
దొంగతనాల నివారణకై పేస్ రికగ్నేషన్ సాంకేతికతో ప్రత్యేక బృందాల ఏర్పాటు
— జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
చెరువుగట్టు శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 30 వరకు జరగనున్న సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, భక్తుల సౌకర్యం, భద్రత మరియు శాంతి–భద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని నల్లగొండ జిల్లా పోలీసు శాఖ విస్తృత స్థాయిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి,దేవాదాయ శాఖ, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, వైద్య, విద్యుత్, పంచాయతీరాజ్, అగ్నిమాపక, ట్రాఫిక్ తదితర సంబంధిత శాఖల అధికారులతో కలిసి చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో విధులు నిర్వర్తించాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జాతర నిర్వహణ కాలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలతో సమగ్ర భద్రతా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఒక అడిషనల్ ఎస్పీ, 5 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు మరియు మహిళ సిబ్బందితో కలిపి మొత్తం సుమారు 1000 మంది పోలీసు సిబ్బందిని వివిధ విధుల్లో నియమించినట్లు తెలిపారు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా దర్శనం జరిగేలా క్యూలైన్ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసి, క్రమబద్ధమైన రాకపోకల కోసం భారీ బ్యారికేడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు సురక్షితంగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు, అవసరమైన చోట సహాయక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
జాతర ప్రాంగణం మొత్తం సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా నిర్వహిస్తూ, వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి పరిస్థితిని క్షణక్షణం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు, పాత నేరస్థుల గుర్తింపునకు ఫేస్ రికగ్నిషన్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.మహిళలపై ఈవ్ టీజింగ్, అసభ్య ప్రవర్తన వంటి ఘటనలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రత్యేక షీ–టీమ్స్, సాదా దుస్తుల పోలీసులు, గస్తీ బృందాలను ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలను గుర్తించి, అవసరమైన చోట బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేపట్టామని, మార్గదర్శక బోర్డులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసులు నిరంతరం విధుల్లో ఉంటారని వివరించారు.
భక్తులు పోలీసు శాఖకు సహకరించి, పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో జాతరను విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే సమీపంలోని పోలీసు సిబ్బందిని లేదా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి, ఎస్బి సి రాము,నార్కెట్పల్లి సీఐ నాగరాజు, నార్కట్పల్లి ఎస్సై విష్ణు తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
