
హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో పదవీ విరమణ పొందుతున్న 13 మంది పోలీసు అధికారులు (వీరిలో 5 ఎస్.ఐ.లు, 7 ఏ.ఎస్.ఐ.లు, 1 హెచ్.సి) లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఐ.పి.ఎస్, ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పదవీ విరమణ వీడ్కోలు సమావేశంలో వి.సి. సజ్జనార్ ఐ.పి.ఎస్ మాట్లాడుతూ, పదవీ విరమణ పొందుతున్న అందరికీ తన తరపున మరియు హైదరాబాద్ సిటీ పోలీసు తరపున శుభాకాంక్షలు తెలిపారు. “మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమ సమయంలో, కోవిడ్ సమస్యలు మరియు ఇతర క్లిష్ట పరిస్థితులలో ఎంతో కృషి చేసినారు, మన రాష్ట్రము ప్రశాంతంగా ఉన్నది. అందుకు నేను ఎంతో గర్వ పడుతున్నాను” అని తెలిపారు. సుదీర్ఘ కాలం (సుమారు 35 నుండి 42 సంవత్సరాలు) పోలీసు శాఖకు సేవలు అందించినారని కొనియాడారు. పదవీ విరమణ తర్వాత మీ ‘సెకండ్ ఇన్నింగ్స్’ లో మీరందరూ బాగుండాలని, కుటుంబ సభ్యులతో సమయం కేటాయించి సంతోషంగా ఉండాలని, మరియు మీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించవద్దని సూచించారు. “మీకు ఇప్పటివరకు సహకరించిన మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మీరు పదవీ విరమణ చేశారని ఇంట్లో ఖాళీగా కూర్చోవద్దు. మీ ఆరోగ్య స్థోమతను బట్టి, ప్రతి నిత్యం మీ కుటుంబం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ప్రతి రోజు ఏదో ఒక పని చేయడం వలన మీరు ఆరోగ్యంగా ఉంటారు” అని సూచించారు. కుటుంబ సభ్యులకు సూచిస్తూ, పదవీ విరమణ పొందిన వారితో మనసుకు బాధ కలిగించే విధంగా ప్రవర్తించవద్దని తెలిపారు. ఈనాడు పదవీ విరమణ పొందుతున్నవారందరూ చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. దీనికి కారణం మీ కుటుంబ సభ్యులే అని మీరందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. పదవీ విరమణతో వచ్చిన డబ్బులను సక్రమమైన పద్ధతిలో, ఎలాంటి మోసాలకు గురికాకుండా ప్రభుత్వ సంస్థలైన బ్యాంకులు, పోస్టాఫీసులలో పెట్టుబడులు పెట్టండి గానీ, ఎవరైనా పది రెట్లు లాభం వస్తుందని చెప్పినట్లయితే మోసపోవద్దు అని హితవు పలికారు. పదవీ విరమణ పొందినవారిని సైబర్ నేరగాళ్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఆ విషయంలో మీరందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మిగిలిన శేష జీవితం మీ కుటుంబంతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. పోలీసు శాఖకు మీరు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తఫ్సీర్ ఇక్బాల్ ఐ.పి.ఎస్., జాయింట్ సి.పి., లా అండ్ ఆర్డర్, శ్రీమతి జె. పరిమళ హానా నూతన్ ఐ.పి.ఎస్., జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, అడ్మిన్, హైదరాబాద్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శంకర్ రెడ్డి మరియు ఇతర సంఘం సభ్యులు పాల్గొన్నారు.

