
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా వి.సి. సజ్జనర్, ఐ.పి.ఎస్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం, మొదటిసారిగా హైదరాబాద్ సిటీ పోలీసులోని అన్ని విభాగాలు మరియు పోలీస్ స్టేషన్ల (లా & ఆర్డర్, ట్రాఫిక్) అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, హైదరాబాద్ పోలీసులకు మరింత మంచి పేరు తీసుకురావడానికి పలు సలహాలు, సూచనలు జారీ చేశారు. “గత ఆరు నెలలుగా హైదరాబాద్ సిటీ పోలీసులోని ప్రతి విభాగం వారు ఎంతో కష్టపడి పనిచేశారు. మీ అందరికీ నా అభినందనలు. ఇదే స్ఫూర్తితో, నిబద్ధతతో భవిష్యత్తులో కూడా పనిచేసి మంచి పేరు తీసుకురావాలి. దేశంలోనే అతి పురాతనమైన మరియు ఎంతో పేరున్న మన హైదరాబాద్ కమిషనరేట్ ప్రతిష్టను మరింత పెంచాలి. మనమందరం సమన్వయంతో పనిచేస్తే తెలంగాణ రాష్ట్రానికి కూడా మంచి పేరు వస్తుంది,” అని తెలిపారు.
“సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తే ప్రత్యేకంగా గుర్తించి ప్రశంసిస్తాం. కానీ విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. కొందరు సిబ్బంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం క్షమించరానిది.” అని హెచ్చరించారు. “పోలీసు సిబ్బంది శాఖకు వెన్నెముక లాంటి వారు. మీరు ప్రజలతో మమేకమై, మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి. ఫిర్యాదుదారుల పట్ల సరైన రీతిలో స్పందించినప్పుడే ప్రజలకు మనపై మంచి అభిప్రాయం, నమ్మకం కలుగుతాయి. మన ప్రవర్తనే డిపార్ట్‌మెంట్ ఇమేజ్‌ను నిర్ణయిస్తుంది. వృత్తి నైపుణ్యంతో, ప్రామాణిక కార్యాచరణ విధానాలను (SOPs) పాటిస్తూ పనిచేయాలి,” అని సూచించారు. ‘ఎక్స్‌ట్రా మైల్ రివార్డ్’: “విధి నిర్వహణతో పాటు మానవతా దృక్పథంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందే సిబ్బందిని ప్రోత్సహించడానికి ‘ఎక్స్‌ట్రా మైల్ రివార్డ్’ (Extra Mile Reward) అనే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం ఉత్తమ సిబ్బందిని గుర్తించి, ప్రశంసాపత్రం మరియు రివార్డుతో ఘనంగా సన్మానిస్తాము,” అని ప్రకటించారు. “ప్రజలతో మమేకమై పనిచేస్తూ.పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ వివిధ కార్యకలాపాలపై సమాచారాన్ని సేకరించాలి. హైదరాబాద్‌ను డ్రగ్ రహిత నగరంగా మార్చడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. డ్రగ్స్ కేసులను లోతుగా దర్యాప్తు చేసి, దోషులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. మహిళలు, చిన్నారుల జోలికి వస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవనే భావన నేరస్థులలో కలిగే విధంగా అన్ని విభాగాలతో పాటు షీ టీమ్స్ కూడా పనిచేయాలి. నగరంలో ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి ట్రాఫిక్ పోలీసులు వినూత్న ఆలోచనలు చేయాలి,” అని సజ్జనర్ అన్నారు. “మెరుగైన పోలీసింగ్ కోసం మీ విలువైన సలహాలను, సూచనలను నేరుగా నాకు తెలియజేయవచ్చు. అందుబాటులో ఉన్న సాంకేతికతను, వనరులను సమర్థవంతంగా వాడుకొని మరిన్ని కేసులను ఛేదించాలి. సిబ్బంది పని ఒత్తిడితో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు,” అని హితవు పలికారు. ఇటీవల మాదన్నపేట పీఎస్ పరిధిలో జరిగిన చిన్నారి హత్య కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహారించిన ఎస్సైలు సుధాకర్, శోభ, సాయికాంత్, శివకుమార్, మరియు సిబ్బందిని అభినందించారు. అలాగే నిరాశ్రయులైన కొందరిని ఆదరించి అమ్మనాన్న ఆశ్రమానికి తరలించిన అప్జల్ గంజ్ ఎస్‌హెచ్‌వో రవి, అడ్మిన్ ఎస్సై నిరంజన్, ఏఎస్సై ధర్మేందర్ ను ప్రశంసించారు. ఓ కేసులో 30 ఏళ్ల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేయడంలో కీలకపాత్ర పోషించిన ఫిలింనగర్ పీఎస్ హెడ్ కానిస్టేబుల్ విజయ సుధాకర్, కానిస్టేబుల్ సురేందర్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో తఫ్సీర్ ఇక్బాల్, ఐ.పి.ఎస్ (జాయింట్ సి.పి, లా & ఆర్డర్), శ్రీమతి పరిమళ హనా నూతన్, ఐ.పి.ఎస్ (జాయింట్ సి.పి, అడ్మిన్), శ్రీమతి కె. అపూర్వారావు, ఐ.పి.ఎస్ (డి.సి.పి, స్పెషల్ బ్రాంచ్), మరియు శ్రీమతి రక్షిత కృష్ణ మూర్తి, ఐ.పి.ఎస్ (డి.సి.పి, హెడ్ క్వార్టర్స్) గారు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఎం. శ్రీనివాసులు, ఐ.పి.ఎస్ (అడిషనల్ సి.పి, క్రైమ్), డి. జోయల్ డెవిస్, ఐ.పి.ఎస్ (జాయింట్ సి.పి, ట్రాఫిక్) లతో పాటు ఇతర డి.సి.పిలు మరియు కానిస్టేబుల్ నుండి అడిషనల్ డి.సి.పి స్థాయి వరకు అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు.

