డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. మరో వ్యక్తి మృతి, భారీగా మేకలు మృతి | ఘటనాస్థలిని పరిశీలించిన జిల్లా ఎస్పీ
భూత్పూర్: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ సమీపంలో జాతీయ రహదారి-44పై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కేబీఎన్ ఫంక్షన్ హాల్ సమీపంలో మేకల లోడ్‌తో వెళ్తున్న వాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న సూచిక బోర్డును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం ఇంధన ట్యాంక్ దెబ్బతినడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
వాహన క్యాబిన్‌లో డ్రైవర్‌తో పాటు ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక భూత్పూర్ పోలీసులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు.
అయితే, మేకలతో ఉన్న వాహనం లోపల మరో వ్యక్తి ఉండగా, మేకలన్నీ ఒక్కసారిగా అతనిపై పడిపోవడంతో బయటకు రాలేక మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో మేకలు కూడా మృతి చెందాయి.
సమాచారం అందుకున్న వెంటనే భూత్పూర్ పోలీసులు, స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రహదారికి అడ్డంగా పడిన సూచిక బోర్డును తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. దీంతో జాతీయ రహదారి-44పై వాహనాల రాకపోకలను త్వరితగతిన పునరుద్ధరించారు.
ప్రమాద సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ డి. జానకి, IPS ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాద పరిస్థితులను, సహాయక చర్యలను సమీక్షించిన ఎస్పీ.. బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఘటనా స్థలంలో DSP వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇజాజ్‌ఉద్దీన్, భూత్పూర్ ఎస్‌ఐ నాగన్న, మూసాపేట ఎస్‌ఐ వేణు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.
