విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్
మహబూబాబాద్, సెప్టెంబర్ 10: క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ అన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
గూడూరు జెడ్పీహెచ్‌ఎస్ (బాలుర) పాఠశాలలో నిర్వహించిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ గూడూరు జోనల్ స్థాయి క్రీడా పోటీలు, ఎంపికల కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ పాఠశాలల నుంచి పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థి క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
తమకు ఇష్టమైన క్రీడలో విద్యార్థులు నిరంతరం సాధన చేయాలని ఎస్పీ సూచించారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని, ఓటమిని నిరాశగా భావించకుండా ఒక సవాలుగా తీసుకుని మరింత పట్టుదలతో ముందుకు సాగాలని అన్నారు. క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, నిరంతర సాధనే విజయానికి పునాదులని పేర్కొన్నారు.
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
విద్యార్థులు చెడు మార్గాలు, మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. వ్యసనాలు యువత భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకుని విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలను పాటిస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.
సైబర్ మోసాలపై అవగాహన
విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో కార్యక్రమంలో సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన పోస్టర్లను ప్రదర్శించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, సందేశాలు, ఆన్‌లైన్ ఆఫర్లకు స్పందించవద్దని విద్యార్థులకు సూచించారు.
అలాగే “డ్రగ్స్‌కు దూరంగా ఉండండి – ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోండి” అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు.
విద్యార్థులు క్రీడలు, విద్యలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని ఎస్పీ ఆకాంక్షించారు. తద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలతో పాటు మహబూబాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
