సంగారెడ్డి:
జిల్లా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ప్రజావాణి’ నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ స్వయంగా దరఖాస్తులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను ఓపికగా విన్నారు. కొన్ని ప్రధాన ఫిర్యాదులపై సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో (ఎస్‌హెచ్‌ఓ) ఫోన్‌లో మాట్లాడి, కేసుల పురోగతిని, జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారించి, బాధితులకు చట్టపరిధిలో సత్వర న్యాయం అందేలా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మధ్యవర్తులను ఆశ్రయించవద్దు
స్థానిక పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగలేదని భావించే ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ఎస్పీ సూచించారు. ఎవరి ప్రమేయం లేదా మధ్యవర్తులు లేకుండా నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రజల బాధలను నేరుగా తెలుసుకుని, వారికి పూర్తి రక్షణ కల్పిస్తూ చట్టబద్ధమైన పరిష్కారం అందించడమే ప్రజావాణి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
