బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లాలో మూడు కీలక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. తంగలపల్లి మండలం జిల్లెళ్ల, గంబిరావుపేట మండలం పెద్దమ్మ చౌరస్తా, రుద్రంగి మండలం మానాల క్రాస్ రోడ్ వద్ద ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అనుమానాస్పద వాహనాలపై నిఘా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
అదేవిధంగా జిల్లా పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పశువులను అక్రమంగా తరలించడం చట్టరీత్యా నేరమని, ఇది మూగజీవాల పట్ల క్రూరత్వానికి దారితీస్తుందని అన్నారు.
ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పశువుల రవాణాకు సంబంధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
గోరక్షణ పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరైనా పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
సోషల్ మీడియాపై కూడా ప్రత్యేక నిఘా కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు ప్రచారాలు, అసత్య సమాచారాన్ని సోషల్ మీడియా వేదికల ద్వారా వ్యాప్తి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిజానిజాలు నిర్ధారించకుండా పోస్టులను ఫార్వర్డ్ చేయడం, గ్రూపుల్లో షేర్ చేయడం చేసిన వారితో పాటు గ్రూప్ అడ్మిన్‌లపై కూడా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ మహేష్ బి. గితే స్పష్టం చేశారు.
