
రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడు భద్రంగా సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ వెళ్లాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆద్వర్యంలో ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ నుంచి వారోత్సవాల సందర్భంగా మొదటి రోజు పోలీసుల ఆధ్వర్యంలో కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో *అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే హాజరయ్యారు. ముందుగా అరైవ్ అలైవ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి వీడియో సందేశం వినిపించారు. రోడ్డు ప్రమాదాలతో ఓ కుటుంబం పడుతున్న ఇబ్బందుల ఆధారంగా రూపొందించిన సందేశం వీడియో ఆలోచింపజేసింది. గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసి గ్రామస్తులతో అరైవ్ అలైవ్ పై ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, చెత్తాచెదారం తొలగింపు పనులు చేయించామని వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. ఆరు రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో రోగ నిర్ధారణ పరీక్షలు, సేవలు అందించామని తెలిపారు. టీబీ ముక్త్ భారత్ లో భాగంగా జిల్లాకు వచ్చిన మొబైల్ ఎక్స్ రే యంత్రం ప్రారంభించామని, నిర్దేశిత గ్రామాల్లో పరీక్షలు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో గత ఏడాది 4,80,000 ప్రమాదాలు జరిగాయని, దానిలో 1,70,000 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రతి డ్రైవర్ వాహన భద్రత ప్రతిజ్ఞ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళాలని సూచించారు. తమ కుటుంబ, పిల్లల బాద్యతను గుర్తు పెట్టుకొని జాగ్రతగా వెళ్లాలని పేర్కొన్నారు. అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని పిలుపునిచ్చారు. ప్రతి నెలా రోడ్డు సేఫ్టీ కమిటి మీటింగ్ ఆర్అండ్ బీ, పీఆర్, పోలీస్, రవాణా శాఖా, ఆర్టీసీ అధికారులతో సమావేశం పెడుతున్నామని, బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, నివారణ చర్యలు, సైన్ బోర్డ్స్ ఏర్పాటు తదితర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వాహనం ఎక్కినప్పటి నుంచి కింద దిగే వరకూ సెల్ ఫోన్ వినియోగించవద్దని వాహనదారులకు సూచించారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకు వెళ్లి వైద్య సహాయం అందించే వారికి ప్రభుత్వం రహవీర్ కింద రూ. 25 వేల సహాయాన్ని అందిస్తుందని, రోడ్డు ప్రమాద బాదితులను ఆసుపత్రిలో వైద్యం పొందే సదుపాయం ఉందని వెల్లడించారు. స్కూల్ ఆటోలు, బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను తరలించవద్దని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు ఎక్కువ సంఖ్యలో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని వెల్లడించారు. నో హెల్మెట్ నో ఎంట్రీ కార్యక్రమాన్ని గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు అందరి రక్షణ కోసం ఈ చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం అవుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు తమ తండ్రికి హెల్మెట్ ఉపయోగం చెప్పాలని పేర్కొన్నారు. రోడ్ సేఫ్టీ లైఫ్ సేఫ్టీ అని ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. ఎక్కువ ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవ్ తోనే అవుతున్నాయని తెలిపారు. జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లాలో రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. వాకథన్, డ్రైవర్లకు కంటి పరీక్షలు ఇతర కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. ఈ వారంలో పోలీస్ శాఖ తరఫున వివిధ కార్యక్రమాలు చేస్తామని వివరించారు. గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీ ఎక్కడైనా రోడ్లపై ఇబ్బందులు, గుంతలు, వీధి దీపాల సమస్య, రోడ్డు వెంట బావులపై నివేదిక పంపాలని సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్ వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, సైకిల్ నడిపే పిల్లలు దానికి వాడే హెల్మెట్ వినియోగించాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపవద్దని ఒకవేళ నడిపి పట్టుబడితే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అసలు ప్రమాదాలే జరవద్దని ఆకాంక్షించారు. త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవ్ చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ ఛైర్మన్ తాళ్ళపల్లి ప్రభాకర్, గ్రామ సర్పంచ్ శ్రీహరి, సర్పంచులు ఫోరం మండలాద్యక్షుడు బోయిని దేవరాజ్, వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.

