ఆన్లైన్ బెట్టింగ్స్, సైబర్ క్రైమ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలి
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఈ రోజు నర్సింహుళపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా స్టేషన్ ఆవరణ, సిబ్బంది బస చేసే ప్రాంతాలు, స్టేషన్ గదులు పరిశీలించి, పరిశుభ్రతపై ఆరా తీశారు.
ఆ తర్వాత స్టేషన్ రికార్డులను పరిశీలిస్తూ, ప్రస్తుతమున్న కేసుల విచారణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి దర్యాప్తు వేగవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ఉండాలని, ప్రతి కేసును నిష్పక్షపాతంగా, నాణ్యతతో దర్యాప్తు చేయాలని SHO కు సూచనలు ఇచ్చారు.
సైబర్ నేరాలు – అవగాహన అవసరం
జిల్లాలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా విద్యావంతులు ఎక్కువగా ఈ నేరాలకు గురవుతున్నారని ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ బెట్టింగ్స్, ఫేక్ లింక్స్, మోసపూరిత యాప్స్ ద్వారా యువత నష్టపోతున్నారని, అందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ నుంచి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అని హెచ్చరించారు.
సిబ్బందికి మార్గదర్శకాలు
స్టేషన్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజలకు 24/7 అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలని చెప్పారు. స్వయంగా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తొర్రుర్ డీఎస్పీ కృష్ణ కిషోర్, తొర్రుర్ సీఐ గణేష్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సైబర్ క్రైమ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సురేష్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.