Breaking News

న్యాయవాదుల సంక్షేమానికి రూ.500 కోట్లు కేటాయించాలి: ఐలు భారీ ధర్నా

హైదరాబాద్, జూన్ 20: న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ప్రత్యేకంగా కేటాయించాలని అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) డిమాండ్ చేసింది. అలాగే 2019 తర్వాత నమోదైన న్యాయవాదులకు వెంటనే హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరింది. రాష్ట్రంలోని సుమారు 60 శాతం మంది న్యాయవాదులకు సరైన ఆదాయం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

శనివారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఐలు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది న్యాయవాదులు పాల్గొని తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ ధర్నాకు ఐలు రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ బార్ కౌన్సిల్ సభ్యుడు కొల్లి సత్యనారాయణ అధ్యక్షత వహించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. పార్థసారథి నాయకత్వం వహించారు.

న్యాయవాదులను నిర్లక్ష్యం చేయొద్దు

ఈ సందర్భంగా కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగం, రాజ్యాధికార వ్యవస్థలో కోర్టులు కీలక భాగమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అధికారం కోర్టులకే ఉంటుందని, అలాంటి వ్యవస్థలో పనిచేస్తున్న న్యాయవాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు.

న్యాయవాదులు లేకపోతే సాధారణ ప్రజలు తమ హక్కులను పొందలేరని, న్యాయవాదులు ఉద్యోగులు మాత్రమే కాక సమాజానికి బాధ్యత కలిగిన వర్గమని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే న్యాయ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

మెజారిటీ వకీళ్లకు కనీస ఆదాయం లేదు

రాష్ట్రంలో మెజారిటీ న్యాయవాదులకు కనీస ఆదాయం కూడా లేకపోవడం ఆందోళనకరమని కొల్లి సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికీ కొందరు న్యాయవాదులు సైకిళ్లపై కోర్టులకు వస్తున్నారని, సరైన యూనిఫాం కూడా లేని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.

న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినా తిరస్కరించారని విమర్శించారు. హెల్త్ కార్డుల జారీలోనూ అనేక లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో శ్వాస కోల్పోయిన పసికందును సీపీఆర్‌తో బ్రతికించిన రాజేంద్రనగర్ పోలీస్ బృందం

ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక పథకాలు

కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో న్యాయవాదుల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయని ఐలు నాయకులు తెలిపారు. కేరళలో కోర్టు ఫీజు స్టాంపుల ద్వారా కూడా సంక్షేమ నిధులు సమకూరుతున్నాయని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా న్యాయవాదుల సంక్షేమ నిధికి భారీగా నిధులు పెంచాలని డిమాండ్ చేశారు.

బార్ కౌన్సిల్ సభ్యుల మద్దతు

ధర్నాలో పాల్గొన్న బార్ కౌన్సిల్ సభ్యులు ఎం. శ్రీనివాసరావు, సీహెచ్. శైలజ, కె. సుజాత పాశం, వి. రఘునాథ్, అశోక్ గౌడ్ పొన్నం, మహేష్ గౌడ్ అకుల తదితరులు ఐలు డిమాండ్లకు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో న్యాయవాదుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో సంక్షేమ నిధికి ప్రభుత్వం మరింత నిధులు కేటాయించాలని కోరారు.

అవసరమైతే మరిన్ని ఆందోళనలు చేపట్టాలని, సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందించాలని సూచించారు.

హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, రాష్ట్రంలోని వివిధ జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు, కార్యదర్శులు కూడా ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

ఐలు ప్రధాన డిమాండ్లు

  • నమోదైన న్యాయవాదులందరికీ ఆరోగ్య కార్డులు జారీ చేయాలి.
  • న్యాయవాదుల జాబితాలను క్రమం తప్పకుండా నవీకరించాలి.
  • వైద్య బీమా పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి.
  • కుటుంబ సభ్యులను కూడా వైద్య బీమాలో చేర్చాలి.
  • అన్ని రకాల అనారోగ్యాలకు చికిత్స వర్తించేలా చూడాలి.
  • గుర్తింపు పొందిన ఆసుపత్రుల సంఖ్యను పెంచాలి.
  • న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌కు అదనంగా రూ.500 కోట్లు కేటాయించాలి.
  • బార్ కౌన్సిల్‌కు ప్రతి ఏడాది రూ.10 కోట్లు కేటాయించాలి.
  • న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి.

ఈ కార్యక్రమంలో ఐలు సెక్రటేరియట్ సభ్యులు సి. రామచందర్ రెడ్డి, రమేష్ కుమార్ మెక్కాడ్, వై. శ్రీనివాసరావు, అన్నపూర్ణ, మహిళా కో-కన్వీనర్ రామలక్ష్మి, విద్యార్థి విభాగం కన్వీనర్ అలీ హైదర్, క్రాంతి, మహ్మద్ అమీర్, అలీ జాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *