
హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా విసీ సజ్జనర్, ఐపీఎస్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)కి చేరుకున్న ఆయన సర్వమత ప్రార్థనల నడుమ బాధ్యతలను చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ విసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ.నగరంలో పీపుల్ వెల్పేర్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. నగర ప్రజల భద్రతకు ఈ నూతన విధానం ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. పీపుల్ వెల్పేర్ పోలీసింగ్‌లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్-రోడ్డు భద్రత, మహిళా-చిన్నారుల భద్రత, టెక్నాలజీలో ఏఐ వినియోగం, సైబర్ క్రైమ్స్-ఆర్థిక నేరాల నియంత్రణ, 24/7 సిటిజన్ సర్వీసెస్-సిబ్బంది సంక్షేమం, తదితర అంశాలపై ఫోకస్ చేస్తామని తెలిపారు. యువత బంగారు భవిష్యత్‌ను నాశనం చేస్తోన్న డ్రగ్స్ మహామ్మారిపై ఉక్కుపాదం మొపుతామన్నారు. గతంలో నమోదు చేసిన డ్రగ్స్ కేసులను పునఃపరిశీలించి మూలాల్లోకి వెళ్లి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘హెచ్ న్యూ బృందాన్ని మరింత బలోపేతం చేసి ‘సే నో టు డ్రగ్స్’ ప్రచారం మాదిరిగా డ్రగ్స్‌పై కూడా అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్స్ బారిన ఎక్కువగా వృద్దులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ అరెస్ట్, స్టాక్ మార్కెట్ మోసాలకు గురవుతున్నారని అన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై కాలనీలు, అపార్టెమెంట్లు, బస్తీలలో అవగాహణ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. కల్తీ ఆహారం అనేది ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పుగా మారిందని, ఈ అంశంపై లోతుగా దృష్టి సారించి, కల్తీ ముఠాలపై చట్టప్రకారం తీసుకుంటామన్నారు. “నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జటిలమవుతోంది. జీఎస్టీ తగ్గడంతో వాహనాల సంఖ్య కూడా పెరిగింది. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేస్తాం. రోడ్లపై ప్రజల సమయాన్ని ఆదా చేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారు రోడ్లపై తిరిగే సూసైడ్ బాంబుల వంటివారు. అలాంటి వారిని ఏమాత్రం ఉపేక్షించం.” అని హెచ్చరించారు. ఆడపిల్లలు, చిన్నారులపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి పనిచేసే హైదరాబాద్ పోలీసుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, ఉత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి రివార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు.
“మతసామరస్యానికి హైదరాబాద్ మారుపేరు. ప్రత్యేకమైన చరిత్రగల ఈ నగరంలో అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. గంగా యమున తెహజీబ్ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తాం.”అని సజ్జనర్ అన్నారు. అడిషినల్ సిపి క్రైం పి.విశ్వప్రసాద్, ఐపిఎస్, జాయింట్ సిపి ట్రాఫిక్ డి.జోయల్ డెవిస్ ఐపిఎస్, జాయింట్ సిపి అడ్మిన్ శ్రీమతి పరిమళ హానా నూతన్ ఐపిఎస్ తో పాటు డీసీపీలు పాల్గొన్నారు.

