
గణేశ్ విగ్రహాల ప్రధాన నిమజ్జనం రెండవ రోజు ముగింపు సందర్భంగా సి.వి. ఆనంద్ ఐపిఎస్,డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్ గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై మీడియాతో మాట్లాడుతూ మూడవ రోజు నుండి 11వ రోజు వరకు మొత్తం 1,40,000 గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఇందులో 1,20,000 విగ్రహాలు బేబీ పాండ్స్, ఇతర చిన్న చెరువుల్లో నిమజ్జనమయ్యాయని వారు పేర్కొన్నారు. అయితే మా ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా హైదరాబాదు సిటో లో 12030 విగ్రహాలు నమోదైనాయి. వీటిలో ప్రదాన నిమజ్జనానికి ముందురోజుల్లో 7330 విగ్రహాలు నిమజ్జనము చేసినారు. మిగతావి 4,700 విగ్రహాలు ప్రధాన నిమజ్జన కార్యక్రమములో నిమజ్జనము కావాలి, కాని దీనిలో నుండి ఇప్పటికీ 900 విగ్రహాలు నెక్లెస్ రోడ్డులో నిమజ్జనం కోసం ఉన్నాయని తెలిపారు. గణేశ్ నిమజ్జన శోభాయాత్ర దాదాపు 40 గంటల పాటు కొనసాగింది. ఈసారి కొన్ని విగ్రహాల ఎత్తు 40 అడుగుల కంటే ఎక్కువగా ఉండడం వల్ల శోభాయాత్ర కొంత ఆలస్యమైంది. నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేయడానికి పోలీసులు రెండు రోజులు నిద్ర లేకుండా పనిచేశారు. 9 డ్రోన్లు, 35 హై-రైజ్ భవనాలపై కెమెరాలను ఉపయోగించి నిఘా పెట్టామని తెలిపారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుల సహకారంతో నిమజ్జనం ముందుగానే పూర్తయింది. మా సెంట్రల్ జోన్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, విద్యుత్, ఆర్‌టిఎ, హెచ్‌ఎండిఎ వంటి వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయం వల్ల నిమజ్జనం విజయవంతమైంది. నిమజ్జన ఊరేగింపులో చిన్నపాటి గొడవలకు సంబంధించి 5 కేసులు నమోదయ్యాయి. అలాగే, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 170 మందిని, పిక్ పాకెటింగ్ కేసుల్లో మరికొందరిని పోలీసులు పట్టుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి నేరాల సంఖ్య తగ్గిందని కమిషనర్ పేర్కొన్నారు. గణేశ్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. ట్రాఫిక్ మళ్లింపులను పూర్తిగా తొలగించినప్పుడే నిమజ్జనం పూర్తయినట్లుగా భావిస్తామని సి.వి. ఆనంద్, ఐపీఎస్, డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాదు తెలిపారు. మండప నిర్వాహకులు ఆలస్యంగా నిమజ్జనానికి బయలుదేరినా, అన్ని విగ్రహాలను హుస్సేన్ సాగర్‌కు పంపించగలిగామని ఆయన చెప్పారు. ఇప్పుడు సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమజ్జనాన్ని కొనసాగిస్తామని వివరించారు. హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం శాంతియుత వాతావరణంలో జరుగుతున్నందుకు ప్రజలకు, గణేశ్ ఉత్సవ సమితి వారికి మరియు మండప నిర్వాహకులకు హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలిపారు. నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయడంలో పోలీసులకు సమన్వయంతో సహకరించినందుకు మండప నిర్వాహకులను ఆయన అభినందించారు. దాదాపు 40 గంటల పాటు అవిశ్రాంతంగా కృషి చేసిన పోలీసు సిబ్బంది మరియు అధికారులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టి.జి. ఐసిసిసి మల్టీ ఏజెన్సీ వార్ రూమ్‌లో అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేస్తూ, సమస్యలను పరిష్కరించి, నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులకు సహకరించారని, అందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విక్రం సింగ్ మాన్, ఐపీఎస్, అడిషినల్ సిపి లా ఆండ్ ఆర్డర్, పి. విశ్వప్రసాద్ ఐపీఎస్ అడిషినల్ సిపి క్రైం, డి. జోయల్ డెవిస్ ఐపీఎస్ జాయింట్ సిపి ట్రాఫిక్, శ్రీమతి ఎన్. స్వేతా ఐపీఎస్ డిసిపి డిడి, శ్రీమతి కె.శిల్పా వల్లి ఐపీఎస్ డిసిపి సెంట్రల్ జోన్, శ్రీమతి రక్షిత కృష్ణ మూర్తి ఐపీఎస్ డిసిపి కార్ హెడ్ క్వార్టర్స్ మరియు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.