Breaking News

లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు – డిజి సి.వి. ఆనంద్ ఐపీఎస్.

లాల్ దర్వాజా బోనాల పండుగ సందర్భంగా, శిఖర పూజా ,ధ్వజారోహణ కార్యక్రమాల్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మరియు డిజి సి.వి. ఆనంద్ ఐపీఎస్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం హైదరాబాద్ నగర కోత్వాల్‌ను శిఖరపూజ, ధ్వజారోహణ కార్యక్రమాలకు ఆహ్వానించడం ఆలయ కమిటీకి ఆనవాయితీగా వస్తోందని ఆయన తెలిపారు. లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం ఎంతో చరిత్ర కలిగిన ఆలయం. 1908 సంవత్సరంలో ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు, ప్లేగు వ్యాధి వ్యాపించి సుమారు 50 వేల మంది ప్రజలు మరణించారు. అప్పట్లో హైదరాబాద్ జనాభా 4 లక్షలు. నాటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్, ప్రధానమంత్రి కిషన్ ప్రసాద్ సలహా మేరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆ తర్వాత మూసీ నదిలో వరదలు, వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. అప్పటి నుండి ఆషాఢమాసంలో బోనాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సుమారు 120 సంవత్సరాలుగా ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఇక్కడ బోనాల పండుగలు నిర్వహిస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు. తెలంగాణలో బోనాల పండుగలు నెలరోజుల పాటు ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
ఆలయ కమిటీ వారు అందరి సమన్వయంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు చేసిందని కమిషనర్ సివి.ఆనంద్ తెలిపారు. ఇప్పటికే గోల్కొండ బోనాలు, బల్కంపేట బోనాలు ప్రశాంత వాతావరణంలో జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అన్ని శాఖలతో సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టామని, హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని, అదనంగా బయట నుండి పోలీస్ సిబ్బందిని రప్పిస్తున్నామని వివరించారు. లాల్ దర్వాజా బోనాల సందర్భంగా వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బి, మున్సిపల్ కార్పొరేషన్ వంటి అన్ని శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించబడ్డాయి. ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్ , ఎండోమెంట్ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చూడాలని అన్ని శాఖల అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ కోరారు. హైదరాబాద్ పోలీస్ తరఫున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని, బోనాల సందర్భంగా జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, ఈవ్ టీజింగ్ వంటివి జరగకుండా క్రైమ్ విభాగం పోలీసులతో, షీ టీమ్ బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.వి కర్నన్ ఐఎఎస్ (కమిషనర్, జిహెచ్‌ఎంసి), కె. అపూర్వ రావు ఐపిఎస్ (డిసిపి స్పెషల్ బ్రాంచ్), స్నేహ మెహ్రా ఐపిఎస్ (డిసిపి సౌత్ జోన్), ఆర్. వెంకటేశ్వర్లు ఐపిఎస్ (డిసిపి ట్రాఫిక్) తో పాటు ఇతర అధికారులు, ఆలయ కమిటీ చైర్మన్ బి. మారుతీ యాదవ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

వాలెంటైన్స్ డే సందర్భంగా సైబర్ మోసాలపై హెచ్చరిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *