మహబూబాబాద్: మహబూబాబాద్ రూరల్ సర్కిల్ పరిధిలోని కురవి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డా. శబరీష్ పి., ఐపీఎస్ సోమవారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది యూనిఫాం, స్టేషన్ పరిసరాలు, లాక్‌అప్, రైటర్స్ రూమ్, ఈ-కాప్స్ తదితర విభాగాలను పరిశీలించారు. సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పోలీసులపై విశ్వాసం పెంపొందించేలా విధులు నిర్వహించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను పద్ధతి ప్రకారం భద్రపరచాలని ఆదేశించారు.
స్టేషన్‌లోని సీసీటీఎన్‌ఎస్, ఈ-సమ్మన్స్, ఈ-సాక్ష్య, ఆన్‌లైన్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, టీజీ-కాప్ వంటి పోలీసింగ్ వ్యవస్థల అమలుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, గంజాయి నేరస్థులు, బూజర్స్, సీసీటీవీ నిఘాకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
కురవి పోలీస్ స్టేషన్ పరిధిలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. సంబంధిత శాఖల సమన్వయంతో బ్లాక్ స్పాట్లను గుర్తించి, ముందస్తు హెచ్చరికలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత
మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ సూచించారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, వారి భద్రతపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్, గుడుంబా, గంజాయిపై నిఘా
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. గుడుంబా తయారీ, విక్రయాలు, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని తెలిపారు. గంజాయి వినియోగం, విక్రయాలు, రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు గ్రామాలు, విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
అత్యవసర పరిస్థితుల్లో బ్లూకోల్ట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సమయం, కోర్టు విధుల్లో ఉన్న సిబ్బంది, పెండింగ్ కేసుల వివరాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల్లో చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ, పోలీసులపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ డా. శబరీష్ పి., ఐపీఎస్ సూచించారు.
