రూ.5 వేల జరిమానా విధించిన మహబూబ్‌నగర్ ఫ్యామిలీ కోర్టు.. దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌లో సమన్వయంతో పనిచేసిన పోలీసులను అభినందించిన ఎస్పీ డి.జానకి
మహబూబ్‌నగర్: డబ్బుల విషయంలో తల్లిదండ్రులతో తరచూ గొడవపడుతూ కన్న తండ్రిని గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. మహబూబ్‌నగర్ ఫ్యామిలీ కోర్టు కమ్ III అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి పి. ఆంజనేయులు శుక్రవారం తీర్పు వెలువరించారు. నిందితుడు కవాలి నదేశ్ @ ఆనంద్‌కు సాధారణ జీవిత ఖైదుతో పాటు రూ.5,000 జరిమానా విధించారు.
డబ్బుల విషయంలో తండ్రిపై గొడ్డలితో దాడి
పోలీసుల వివరాల ప్రకారం.. 2024 సెప్టెంబర్ 19న రాత్రి రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామంలో డబ్బుల విషయంలో నదేశ్ @ ఆనంద్ తన తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తన తండ్రి కవాలి నారాయణపై గొడ్డలితో మెడపై పలుమార్లు దాడి చేశాడు.
కేకలు విని ఇంట్లోకి వెళ్లిన నారాయణ భార్య కవాలి చంద్రకళ.. తన కుమారుడు భర్తపై గొడ్డలితో దాడి చేస్తున్నట్లు గుర్తించింది. తీవ్రంగా గాయపడిన నారాయణను కుటుంబ సభ్యులు చికిత్స కోసం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు.
పక్కా ఆధారాలతో నిందితుడికి శిక్ష
మృతుడి భార్య చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజాపూర్ ఎస్‌ఐ రవి కేసు నమోదు చేశారు. జడ్చర్ల రూరల్ సీఐ టి. నాగార్జున గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై న్యాయస్థానంలో అభియోగాలు రుజువయ్యేలా ఆధారాలను సమర్పించారు.
దర్యాప్తులో.. నారాయణ, చంద్రకళ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా, నిందితుడు ఎలాంటి పని చేయకుండా డబ్బుల కోసం తల్లిదండ్రులతో తరచూ గొడవపడేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే తండ్రిపై దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడించారు.
పోలీసు అధికారులను అభినందించిన ఎస్పీ
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టి. నాగార్జున గౌడ్, కేసు నమోదు చేసిన ఎస్‌ఐ రవి, APP కె. నరేష్ కుమార్, జె. శ్రీనివాస్, HC-160, ఫ్యామిలీ కోర్టు లైజన్ అధికారి, CDO జె. శేఖర్, PC-2177 తదితరులను జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ అభినందించారు.
నేరాలకు పాల్పడే వ్యక్తులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా దర్యాప్తు, న్యాయ ప్రక్రియలో పోలీసు శాఖ సమన్వయంతో పనిచేస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.
