నిమజ్జనోత్సవాల కోసం 20 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు.. 10 వేల సీసీ కెమెరాలతో నిఘా
హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనోత్సవాలు, శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో, వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. శనివారం ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జన సన్నాహాలను ఉన్నతాధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అంతకుముందు పోలీస్ అధికారులతో కలిసి ఖైరతాబాద్ బడా గణేశుడికి సీపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు పటిష్ట భద్రత
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంతో పాటు బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు సాగే ప్రధాన శోభాయాత్ర ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖ, జలమండలి తదితర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
20 వేల మంది పోలీసులతో బందోబస్తు
గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా నగరంలో దాదాపు 20 వేల మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు విధుల్లోకి తీసుకున్నట్లు సీపీ వెల్లడించారు. శోభాయాత్ర సజావుగా సాగేందుకు కీలక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించనున్నట్లు తెలిపారు.
10 వేల సీసీ కెమెరాలతో నిఘా
శోభాయాత్రను నిరంతరం పర్యవేక్షించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఊరేగింపు జరిగే ప్రధాన మార్గాల్లోని దాదాపు 10 వేల సీసీ కెమెరాలను బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC)కు అనుసంధానించినట్లు వెల్లడించారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తారని తెలిపారు.
మహిళల భద్రతకు 26 షీ-టీమ్స్
మహిళలు, యువతుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో మూడు షిఫ్టుల్లో 26 షీ-టీమ్స్ నిరంతరం విధులు నిర్వహిస్తాయని వెల్లడించారు.
ట్రాఫిక్ మార్గదర్శకాలు పాటించాలి
నిమజ్జనోత్సవాల సందర్భంగా నగర ట్రాఫిక్ విభాగం ఎప్పటికప్పుడు జారీ చేసే ట్రాఫిక్ మార్గదర్శకాలను ప్రజలు గమనించాలని సీపీ సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులకు అనుగుణంగా ప్రజలు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని కోరారు.
నిమజ్జన పర్వాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా ముగించేందుకు పోలీస్ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని సీపీ సజ్జనార్ తెలిపారు. నగర ప్రజలంతా శాంతియుత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య గణేష్ నిమజ్జనోత్సవాలను జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
