హైదరాబాద్: ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకాన్ని మరింత పెంచే లక్ష్యంతో హైదరాబాద్ నగర పోలీసు విభాగం కృత్రిమ మేధ ఆధారిత స్మార్ట్ కియోస్క్ ‘సేతు’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌లో పైలట్ ప్రాజెక్టుగా శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ‘సేతు’ను ప్రారంభించారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే పౌరులు తమకు అనుకూలమైన భాషలోనే ఫిర్యాదును నమోదు చేసుకునే అవకాశం ఈ కియోస్క్ ద్వారా లభిస్తుంది. కృత్రిమ మేధ సాయంతో ఫిర్యాదుదారుడి వివరాలను డిజిటల్‌గా నమోదు చేసి, వెంటనే డిజిటల్ రసీదును అందజేస్తుంది. ఫిర్యాదు తదుపరి ప్రక్రియపై కూడా స్పష్టమైన సమాచారం అందిస్తుంది.
నమోదైన ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేక డిజిటల్ ట్రాకింగ్ సదుపాయం ఉండటంతో, సమస్య పరిష్కారం అయ్యే వరకు దర్యాప్తు పురోగతిని ఉన్నతాధికారులు పర్యవేక్షించవచ్చు. దీంతో పోలీసింగ్‌లో పారదర్శకత, జవాబుదారీతనం పెరగడంతో పాటు సిబ్బంది సమయం కూడా ఆదా కానుంది.
ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే పోలీసింగ్ వ్యవస్థకు ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. ప్రజలు–పోలీసుల మధ్య విశ్వసనీయతను పెంచే వారధిగా ‘సేతు’ నిలుస్తుందని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టు ఫలితాల ఆధారంగా ఈ సేవలను దశలవారీగా నగరంలోని ఇతర పోలీస్ స్టేషన్లకు విస్తరించనున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, అవినాష్ కుమార్, గోల్కొండ జోన్ డీసీపీ జె. రాఘవేందర్ రెడ్డి, డెవలపర్ అమిత్ సింగ్, అదనపు డీసీపీ కృష్ణ గౌడ్, ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌హెచ్‌ఓ మల్లేశ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
