హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడికి నాంపల్లిలోని IV అదనపు సెషన్స్ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.16 వేల జరిమానా విధించింది. ఈ మేరకు సెప్టెంబర్ 17న గౌరవ IV అదనపు సెషన్స్ న్యాయమూర్తి శ్రీ జె. విక్రమ్ తీర్పు వెలువరించారు.
ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 110/2020కు సంబంధించిన సెషన్స్ కేసు (SC.No.282/2021)లో మూడే రాజు నాయక్ (37)పై IPC సెక్షన్లు 302, 379, 201 కింద నేరం రుజువైంది. దీంతో న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు మొత్తం రూ.16 వేల జరిమానా విధించింది.
కేసు వివరాల ప్రకారం.. 2020 ఫిబ్రవరి 1న పి. రమేష్ (50) బోరబండకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మరుసటి రోజు ఆయన ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు వాట్సాప్ సందేశం రావడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్పందన లేకపోవడంతో పాటు ఫోన్ స్విచ్‌ఆఫ్ అయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్.ఆర్.నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు శాస్త్రీయ ఆధారాలను సేకరించి నిందితుడిని అరెస్ట్ చేసి, కేసుకు సంబంధించిన ఆధారాలను న్యాయస్థానంలో సమర్పించారు. విచారణ అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.
కేసులో దర్యాప్తు అధికారులు ఎస్. మురళీ కృష్ణ, వి. నరసింహారెడ్డి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీవాణి, కోర్టు డ్యూటీ ఆఫీసర్ మన్పాటి బలరామ్, ప్రాసెస్ డ్యూటీ బి. కృపేంద్ర తదితరులు కీలకంగా వ్యవహరించారు. నిందితుడికి శిక్ష పడేలా ఆధారాలను సమర్థవంతంగా కోర్టుకు సమర్పించిన దర్యాప్తు అధికారులు, కోర్టు సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సేవలను అధికారులు అభినందించారు.
