మహబూబాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో కొనసాగిందని తెలిపారు. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో అనంతరం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేశారు.
ప్రజాస్వామ్య పాలనలో ప్రజల సంక్షేమం, పారదర్శకత, జవాబుదారీతనం కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందేలా ప్రజాపాలన వ్యవస్థ పనిచేయాలని అన్నారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
