సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు జహీరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని వివిధ శాఖల అధికారులతో శుక్రవారం జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో డీఎస్పీ సైదా నాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గణేష్ శోభాయాత్రలు జరిగే మార్గాల్లో రోడ్ల పరిస్థితి, అవసరమైన మరమ్మతులు, నిమజ్జనం జరిగే నారింజ వాగు వద్ద బారికేడింగ్, భద్రతా లైటింగ్, పారిశుద్ధ్య ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆయా ప్రాంతాలను అధికారులు ప్రత్యక్షంగా సందర్శించి, చేపట్టాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు.
నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డీఎస్పీ సూచించారు. అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలిపారు.
సమీక్షా సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, జహీరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని ఎస్‌ఐలు పాల్గొన్నారు.
