- జిల్లా ప్రజలు, పోలీసు సిబ్బంది సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రత్యేక ప్రార్థనలు
- శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రులు జరుపుకోవాలని పిలుపు
- శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి
సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు సాయుధ దళ కార్యాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరునికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ (ఐపీఎస్) దంపతులు, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిలతో కలిసి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి పుష్పాలు, పండ్లు సమర్పించి ప్రత్యేక హారతి ఇచ్చారు.
పోలీసుల కర్తవ్య నిర్వహణలో విఘ్నాలు తొలగాలి: ఎస్పీ
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే గణనాథుడు జిల్లా ప్రజలందరికీ, పోలీసు అధికారులు, సిబ్బందికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు. నిరంతరం ప్రజల రక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తున్న పోలీసులకు కర్తవ్య నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు రాకుండా మనోధైర్యం, మానసిక ప్రశాంతత లభించాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది కుటుంబాల్లో నిత్యం శ్రేయస్సు, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఐక్యతతో, పరస్పర సోదరభావంతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. ఉత్సవాల ప్రారంభం నుండి నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ పోలీసుశాఖకు సహకరిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పూజా కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నరేందర్, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణారెడ్డి, రాము నాయుడు, మహేష్ గౌడ్, నాయిముద్దీన్, సుమన్ కుమార్, ఆర్‌ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, శ్రీనివాస్ రావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్ధన్, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
