సంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సెప్టెంబర్ నెల మొదటి మొదటి బుధవారం – సైబర్ జాగృకత దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, సదాశివపేట పట్టణంలోని హర్ష బ్యాంకేట్ హాల్ నందు సైబర్ నేరాల నివారణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.., సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి. ఆనంద్, ఐపీఎస్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ షికా గోయల్, ఐపీఎస్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సైబర్ జాగృకత దివాస్ పేరుతో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు–డిజిటల్ భద్రత, ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు, పెట్టుబడి మోసాలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది అన్నారు.
డిజిటల్ చెల్లింపుల్లో జాగ్రత్త : తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, OTP, PIN, CVV, పాస్‌వర్డ్‌లు వంటి రహస్య సమాచారాన్ని ఎవరితో పంచుకోవద్దని అన్నారు. బ్యాంకు అధికారులు, పోలీసుల పేరుతో ఫోన్ చేసే వ్యక్తులను నమ్మి వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలు ఇవ్వవద్దని, డిజిటల్ చెల్లింపులు చేసే సమయంలో సరైన వ్యక్తి/ఖాతాకే నగదు వెళ్తుందో నిర్ధారించుకోవలని సూచించారు.
ఆన్‌లైన్ షాపింగ్‌లో అప్రమత్తత : ఆన్‌లైన్‌లో భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్లు చూపిస్తూ నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. గుర్తుతెలియని వెబ్‌సైట్లు, వ్యక్తులకు ముందస్తుగా నగదు చెల్లించకుండా, విశ్వసనీయమైన ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు.
పెట్టుబడి మోసాలపై అప్రమత్తంగా ఉండాలి : తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్, క్రిప్టో, షేర్ మార్కెట్ పేరుతో వచ్చే అనుమానాస్పద ఆఫర్లను నమ్మవద్దని సూచించారు. తొందరపెట్టి డబ్బులు పెట్టుబడి పెట్టించే వ్యక్తులు లేదా సంస్థల వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. తద్వారా మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
గణేష్ మండపాల వద్ద కూడా సైబర్ అవగాహన : గణేష్ చతుర్థి నవరాత్రి ఉత్సవాలు జరుగునున్న నేపథ్యంలో గణేష్ మండపాల వద్ద సైబర్ నేరాలపై అవగాహన పోస్టర్లను ఏర్పాటు చేసి భక్తులు, ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శాంతి కమిటీ, సమన్వయ సమావేశాలను కూడా సైబర్ అవగాహన కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు.
సైబర్ నేరాలను అరికట్టడంలో పోలీసులతో పాటు ప్రజల అప్రమత్తత కూడా ఎంతో కీలకం. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారితీయవచ్చు. ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతా నియమాలను పాటించి, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలి అని ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో డి4సి డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, సదాశివపేట ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, సైబర్ సెల్ సిబ్బంది, సదాశివపేట పట్టణానికి చెందిన సుమారు 350 మంది వ్యాపారవేత్తలు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
