హైదరాబాద్: కేబీఆర్ పార్క్ చుట్టూ అమలులో ఉన్న వన్-వే ట్రాఫిక్ విధానాన్ని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ శ్రీ ఆర్‌వి కర్ణన్, ఐఏఎస్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆగస్టు 18న ప్రారంభమైన నూతన ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చి 15 రోజులు పూర్తైన నేపథ్యంలో ఇప్పటివరకు ఎదురైన సమస్యలు, వాహనదారుల నుంచి వచ్చిన సూచనలు, ట్రాఫిక్ రద్దీ పరిస్థితులను అధికారులు సమగ్రంగా పరిశీలించారు.
వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి కేబీఆర్ పార్క్ చుట్టూ విస్తృతంగా పర్యటించిన పోలీస్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ప్రవాహాన్ని స్వయంగా పరిశీలించారు. ఫిల్మ్‌నగర్, జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నంబర్ 45, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ కూడళ్ల వద్ద వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ ఒత్తిడి, వాహనాల వేగం తగ్గుతున్న ప్రాంతాలను అధికారులు గుర్తించారు.
వాహనాలు సాఫీగా సాగేందుకు అవసరమైన దిద్దుబాటు చర్యలపై ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. పలు ప్రాంతాల్లో రహదారుల వెడల్పు పెంచడం ద్వారా వాహనాల రాకపోకలను మరింత సులభతరం చేయవచ్చని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా వాహనాల వేగం మందగిస్తున్న ప్రాంతాలను ‘బాటిల్‌నెక్’ ప్రాంతాలుగా గుర్తించి, అక్కడ తక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో రహదారి మరమ్మతులను వెంటనే పూర్తి చేయడంతో పాటు డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేసి, వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాకపోకలు నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
ప్రత్యేకంగా ఫిల్మ్‌నగర్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 45 జంక్షన్ వరకు వాహనాల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ మార్గంలో రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, నీటి సరఫరా పైపులైన్లు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల వ్యవస్థలను గుర్తించి, వాటిని ప్రత్యామ్నాయ ప్రాంతాలకు తరలించే ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతిపాదించిన ‘హెచ్-సిటీ’ ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రస్తుతం వన్-వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల సమయంలో ట్రాఫిక్ నిర్వహణకు ఇబ్బందులు తలెత్తకుండా, వాహనదారులకు కనీస అసౌకర్యం కలిగేలా అవసరమైన చర్యలను సమన్వయంతో చేపట్టాలని అధికారులు స్పష్టం చేశారు.
నూతన వన్-వే విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నగరవాసులు, వాహనదారులు బాధ్యతాయుతంగా సహకరిస్తున్నారని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, రహదారి విస్తరణ, మౌలిక సదుపాయాల పనుల్లో ప్రజల సహకారం కీలకమని పేర్కొంటూ నగరవాసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల రాకపోకలను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా సమన్వయంతో చర్యలు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. వన్-వే విధానం అమల్లో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటికి తక్షణ పరిష్కారాలు చూపేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో ట్రాఫిక్ విభాగం జాయింట్ పోలీస్ కమిషనర్ డి. జోయెల్ డెవిస్, డీసీపీ ట్రాఫిక్ కాజల్ సింగ్, టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్‌తో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చేపట్టాల్సిన రహదారి విస్తరణ, మరమ్మతులు, డ్రైనేజీ పనులు, యుటిలిటీ మార్పిడి పనులను వేగవంతం చేసి ట్రాఫిక్ సమస్యలను మరింత సమర్థంగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
