హైదరాబాద్, ఆగస్టు 18, 2026: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఓపెన్ కరెక్షనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (OCIs) పనితీరును పరిశీలించి, వాటి సమర్థవంతమైన నిర్వహణ, ఖైదీల పునరావాసం, సమాజంలో పునఃసమీకరణకు అవసరమైన కనీస ప్రమాణాల రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ (PAC)ని సందర్శించింది.
ఈ కమిటీని సుహాస్ చక్మా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా & ఇతరులు, రిట్ పిటిషన్ (సివిల్) నం.1082/2020 కేసు నేపథ్యంలో ఏర్పాటు చేశారు.
హై-పవర్డ్ కమిటీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ శ్రీపతి, BPR&D డైరెక్టర్ జనరల్ శ్రీ అలోక్ మిట్టల్, IPS, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ రాజీవ్ శర్మ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి ప్రతిమా గుప్తా, HPC మెంబర్ సెక్రటరీ శ్రీమతి శిఖా శ్రీవాస్తవ, రిజిస్ట్రార్-కమ్-నోడల్ ఆఫీసర్ శ్రీ ప్రాతుల్ జోషి, లా రీసెర్చర్ శ్రీ దిగ్విజయ్ గణపతి, BPR&D డీఐజీ శ్రీ K.P.A. ఇల్యాస్, IPS తదితరులు ఉన్నారు.
కమిటీ తొలుత చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని సందర్శించి, జైలు పరిశ్రమలు, ఫ్యాక్టరీల నిర్వహణ, ఖైదీలకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, నివృత్తి డీ-అడిక్షన్ సెంటర్ కార్యకలాపాలను పరిశీలించింది.
అనంతరం చర్లపల్లి PACను సందర్శించిన కమిటీకి డైరెక్టర్ జనరల్, ప్రిజన్స్ & కరెక్షనల్ సర్వీసెస్ డా. సౌమ్య మిశ్రా, IPS, ఓపెన్ జైళ్ల నిర్వహణ, సంస్కరణాత్మక విధానాలు, ఖైదీల పునరావాసం, జీవనోపాధి మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు అందించారు.
తెలంగాణలో చర్లపల్లి, వరంగల్‌లో రెండు ప్రత్యేక ఓపెన్ జైళ్లు/ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీలు ఉన్నాయని ఆమె తెలిపారు. 1954లో స్థాపించబడిన చర్లపల్లి PAC 129 ఎకరాల్లో, 2022లో ఏర్పాటు చేసిన వరంగల్ PAC 101 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. అదనంగా నాలుగు కేంద్ర కారాగారాలు, ఆరు జిల్లా జైళ్లతో పాటు కొన్ని సబ్-జైళ్లలో సెమీ-ఓపెన్ జైళ్లు పనిచేస్తున్నాయని తెలిపారు.
చర్లపల్లి PACలో 150 మంది ఖైదీలకు సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 51 మంది ఖైదీలు ఉన్నారు. మంచి ప్రవర్తన, విశ్వసనీయత, శారీరక-మానసిక ఆరోగ్యం, భావోద్వేగ స్థిరత్వం, కుటుంబ సంబంధాలు, పని చేయాలనే ఆసక్తి వంటి అంశాల ఆధారంగా ఖైదీలను ఓపెన్ కరెక్షనల్ ఇన్‌స్టిట్యూషన్లకు ఎంపిక చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
సాధారణ జైళ్లకు భిన్నంగా, ఓపెన్ కరెక్షనల్ ఇన్‌స్టిట్యూషన్లలో క్రమశిక్షణతో పాటు ఖైదీల సంస్కరణ, పునరావాసం, బాధ్యతాయుత జీవనానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తక్కువ పర్యవేక్షణతో పని చేసే అవకాశం కల్పిస్తూ, నైపుణ్యాభివృద్ధి, వినోదం, జీవనోపాధి కార్యక్రమాల్లో పాల్గొనేలా ఖైదీలను ప్రోత్సహిస్తున్నారు.
PACల్లో సేంద్రీయ వ్యవసాయం, కూరగాయల సాగు, డెయిరీ ఫార్మింగ్, పౌల్ట్రీ, నర్సరీలు, ఆక్వాకల్చర్, తేనెటీగల పెంపకం, స్టీల్ ఫర్నిచర్ తయారీ, రిటైల్ ఇంధన కేంద్రాలు, వేయిబ్రిడ్జ్ నిర్వహణ, కార్ వాషింగ్ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు డా. సౌమ్య మిశ్రా తెలిపారు.
ఖైదీలకు పెరిగిన ప్రోత్సాహకాలు
తెలంగాణ ప్రభుత్వం 2024 అక్టోబర్ 1 నుంచి ఖైదీలకు అందించే రోజువారీ ప్రోత్సాహకాలను పెంచింది. అత్యంత నైపుణ్యం కలిగిన ఖైదీలకు రోజుకు ₹200, నైపుణ్యం కలిగిన వారికి ₹150, సెమీ-స్కిల్డ్ ఖైదీలకు ₹125, అన్స్కిల్డ్ ఖైదీలకు ₹100 చొప్పున చెల్లిస్తున్నట్లు డీజీ వివరించారు.
అలాగే, ఓపెన్ కరెక్షనల్ ఇన్‌స్టిట్యూషన్లలోని ఖైదీలకు సాధారణ జైళ్లలోని ఖైదీలతో పోలిస్తే నెలకు అదనంగా 8 రోజుల రిమిషన్ పొందే అవకాశం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో IG ప్రిజన్స్ శ్రీ N. మురళీ బాబు, DIG ప్రిజన్స్, వరంగల్ రేంజ్ శ్రీ M. సంపత్, చర్లపల్లి PAC సూపరింటెండెంట్ శ్రీ D. భరత్, చర్లపల్లి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ శ్రీ G. ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
