జెండా ఊపి 2K రన్‌ను ప్రారంభించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ పి., ఐపీఎస్
మహబూబాబాద్ జిల్లా, గూడూరు, ఆగస్టు 22: యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గూడూరు మండల కేంద్రంలో ‘మన ఊరు – మన బాధ్యత: 2K రన్ – ఫర్ డ్రగ్స్ ఫ్రీ సొసైటీ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక పాఠశాలలు, కళాశాలలకు చెందిన 1,000 మందికి పైగా విద్యార్థులు, యువతీ యువకులు ఈ అవగాహన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ పి., ఐపీఎస్ జెండా ఊపి 2K రన్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, యువతను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో విలువైనదని, దురలవాట్లకు దూరంగా ఉంటూ జీవిత లక్ష్యాలను సాధించేందుకు కష్టపడాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. క్షణిక ఆనందం కోసం మాదకద్రవ్యాలకు బానిసైతే జీవితాంతం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
గంజాయి టెస్టింగ్ కిట్‌పై అవగాహన
డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందని ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా గంజాయి టెస్టింగ్ కిట్ పనితీరును విద్యార్థులకు ప్రదర్శించి, అనుమానాస్పద సందర్భాల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని పరీక్షల ద్వారా గుర్తించే విధానంపై అవగాహన కల్పించారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని ఎస్పీ సూచించారు.
డ్రగ్స్‌పై కఠిన చర్యలు
డ్రగ్స్‌ను విక్రయించడం, సరఫరా చేయడం, రవాణా చేయడం లేదా వినియోగించడం వంటి చర్యలకు పాల్పడితే NDPS చట్టం ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసుల్లో చిక్కుకోవడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలతో పాటు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.
మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే చర్యలు
మైనర్లకు సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా తదితర పొగాకు ఉత్పత్తులను విక్రయించే దుకాణదారులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. కిరాణా, పాన్ షాపుల వద్ద మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదనే హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.
సమాచారం ఇస్తే రూ.5,000 వరకు నగదు బహుమతి
మహబూబాబాద్ జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు, యువత పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు, రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
సమాచారం అందించిన వారికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేస్తామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎస్పీ స్పష్టం చేశారు.
గంజాయి, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని యాంటీ-డ్రగ్ హెల్ప్‌లైన్ నంబర్ 87126 56999కు తెలియజేయాలని కోరారు.
కార్యక్రమం ముగింపులో ఎస్పీ డా. శబరీష్ పి., ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత కలిసి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
