Breaking News

శాంతిభద్రతల పరిరక్షణ, సమర్థవంతమైన పోలీసింగ్, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మన లక్ష్యం

— జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్

మహబూబాబాద్ రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్

జిల్లా పోలీస్ అధికారి డాక్టర్ శబరీష్, ఐపీఎస్ మహబూబాబాద్ రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ నిర్వహించి శాంతిభద్రతల పరిస్థితులు, నేరాల నియంత్రణ, దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదైన హత్యలు, ఆస్తి నేరాలు, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, సైబర్ నేరాలు, పెండింగ్ కేసులు, చార్జిషీట్లు, కోర్టు వ్యవహారాల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.

సీసీటీఎన్‌ఎస్ 2.0 (CCTNS 2.0) వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించాలని ఎస్పీ ఆదేశించారు. స్టేషన్‌లో నమోదయ్యే ప్రతి కేసు, ఫిర్యాదు, దర్యాప్తు వివరాలు, అరెస్టులు, చార్జిషీట్లు, వారెంట్లు, ఆస్తుల స్వాధీనం తదితర వివరాలను ఎప్పటికప్పుడు CCTNS 2.0లో నమోదు చేయాలని, పెండింగ్ ఎంట్రీలు లేకుండా డేటా నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు. డిజిటల్ పోలీసింగ్‌లో CCTNS 2.0 కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, గంజాయి, డ్రగ్స్, గుడుంబా, అక్రమ మద్యం తయారీ, విక్రయాలు, రవాణాపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు.

అలాగే నైట్ పెట్రోలింగ్, నైట్ బీట్స్, వాహన తనిఖీలు, అనుమానాస్పద వ్యక్తుల తనిఖీలు, హైవేలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద పటిష్టమైన గస్తీ నిర్వహిస్తూ దొంగతనాలు, చోరీలు, ఇతర నేరాలను ముందస్తుగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామానికి సంబంధించిన శాంతిభద్రతల పరిస్థితులు, గ్రామాల వారీ సమస్యలు, కమ్యూనిటీ టెన్షన్స్, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, నేర ప్రవృత్తి గల వ్యక్తుల కదలికలు, బైండోవర్ కేసులు, పాత కక్షలు, భూ వివాదాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గ్రామాల్లో నిర్వహిస్తున్న కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ (CCPs) అమలును ప్రత్యేకంగా సమీక్షిస్తూ ప్రతి గ్రామాన్ని తరచూ సందర్శించాలని, ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని, గ్రామ పెద్దలు, యువత, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులతో నిరంతరం సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గ్రామస్థాయిలో పోలీస్-ప్రజల అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తూ కమ్యూనిటీ పోలీసింగ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో 17 ఫిర్యాదుల స్వీకరణ: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

దర్యాప్తులో ఉన్న కేసులను నాణ్యమైన సాక్ష్యాధారాలతో వేగంగా పూర్తి చేసి బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు సమీక్షించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదును వెంటనే నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెరిగేలా పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించాలని సూచించారు.

కోర్టు సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు (NBWs), కమిషన్ల నుంచి వచ్చే పిటిషన్లు, ఇతర న్యాయపరమైన ప్రక్రియలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, షీ టీమ్స్, సైబర్ అవగాహన కార్యక్రమాలు, సీసీ కెమెరాల వినియోగాన్ని విస్తృతంగా పెంచుతూ నేరాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు.

స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, మాల్ఖానా నిర్వహణ, ఆయుధాల సంరక్షణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. శుభ్రమైన, క్రమబద్ధమైన పోలీస్ స్టేషన్ ప్రజల్లో పోలీస్ శాఖపై సానుకూల భావనను పెంపొందిస్తుందని తెలిపారు.

ఇటీవల రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని సమయస్ఫూర్తితో రక్షించిన మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, బ్లూ కోల్ట్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే సేవాభావంతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతి రావు, మహబూబాబాద్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంజలి, సబ్ ఇన్‌స్పెక్టర్లు పి.రాజు, సతీష్, రవి కిరణ్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *