మన్‌హా లగ్జరియస్ ఉమెన్స్ స్టోర్‌లో సేల్స్‌వుమన్‌పై కత్తితో దాడి
హైదరాబాద్: చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. అజాంపురలోని మన్‌హా లగ్జరియస్ ఉమెన్స్ స్టోర్‌లో సేల్స్‌వుమన్‌గా పనిచేస్తున్న తహేరా బానుపై గతంలో అదే దుకాణంలో పనిచేసిన మొహమ్మద్ ఇబ్రహీం కత్తితో దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
పోలీసుల వివరాల ప్రకారం, అక్టోబర్ 9, 2026న రాత్రి సుమారు 9:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కత్తితో జరిగిన దాడిలో తహేరా బానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించగా, అదే రోజు రాత్రి సుమారు 10:30 గంటలకు మృతి చెందింది.
మృతురాలి భర్త మహమ్మద్ ఖాజా మొయిన్ ఉద్దీన్ అలియాస్ అను ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 392/2026, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 103 కింద హత్య కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో నిందితుడిని హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ ఇబ్రహీం (35), తండ్రి పేరు మొహమ్మద్ సలీం, వృత్తి సేల్స్‌మ్యాన్‌గా గుర్తించారు. ఈ కేసులో భాగంగా అక్టోబర్ 11న నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చట్టపరమైన ప్రక్రియ అనంతరం నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు. కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
హత్యకు గల కారణం
పోలీసుల కథనం ప్రకారం, నిందితుడు గత కొన్ని సంవత్సరాలుగా మృతురాలితో సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే గత ఆరు నెలలుగా ఆమె అతడిని దూరంగా ఉంచుతూ, అతని అభ్యర్థనలకు స్పందించడం లేదని తెలుస్తోంది. ఈ కారణంగా ఆమెపై కక్ష పెంచుకున్న నిందితుడు దాడికి పాల్పడి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
