నల్లగొండ, జూలై 22: జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ బుధవారం దేవరకొండ సబ్‌డివిజన్ పరిధిలోని చందంపేట పోలీస్ స్టేషన్‌ను సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఎస్పీ, స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, కేసుల నమోదు విధానం, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ ఆస్తుల సంరక్షణ, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ఆయుధాల నిర్వహణ, సీసీటీఎన్‌ఎస్ నమోదులు, డిజిటల్ రికార్డుల నిర్వహణతో పాటు పోలీస్ సిబ్బందికి అందజేసిన కిట్ల వినియోగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నివారణ, దొంగతనాల అరికట్టడం, రోడ్డు భద్రత, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల అమలుపై దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును సత్వరమే స్వీకరించి చట్టబద్ధంగా పరిష్కరించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
విలేజ్ పోలీస్ ఆఫీసర్ (VPO) వ్యవస్థను మరింత బలోపేతం చేసి గ్రామస్థులతో సమన్వయం పెంచాలని, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే గ్రామాలు, ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పెంచడం ద్వారా నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు.
రాత్రి గస్తీని పటిష్టంగా అమలు చేయడం, బీట్ అధికారుల పనితీరును నిరంతరం పర్యవేక్షించడం, పెండింగ్ వారెంట్ల అమలు వేగవంతం చేయడం, రౌడీ షీటర్లు, అనుమానితుల కదలికలపై నిఘా కొనసాగించడం, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచిస్తూ పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు మార్గదర్శకాలు జారీ చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్ రావు, ఎస్‌బీ సీఐ నాగరాజు, డీసీఆర్‌బీ సీఐ శ్రీను నాయక్, డిండి సీఐ బిసన్న, చందంపేట ఎస్‌ఐ లోకేష్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
